Breaking News

డాలర్ల పేరుతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కి దగా

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వాట్సాప్ ద్వారా కస్టమ్స్ క్లియరెన్స్ డాలర్ల పేరుతో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మోసం చేసి ₹21.37 లక్షలు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను మదనపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు.


Published on: 24 Jun 2026 10:54  IST

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వాట్సాప్ ద్వారా కస్టమ్స్ క్లియరెన్స్ డాలర్ల పేరుతో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను మోసం చేసి ₹21.37 లక్షలు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను మదనపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు.

మదనపల్లె మండలం పప్పిరెడ్డిపల్లెకు చెందిన వడ్లూరి మోహన్ కుమార్ అనే యువకుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.మార్చి 22న మోహన్ కుమార్‌కు ఒక అంతర్జాతీయ నంబర్ నుండి వాట్సాప్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తన పేరు 'ఎడ్విన్' అని, అమెరికాలోని టెక్సాస్‌లో పీడియాట్రీషియన్ అని పరిచయం చేసుకున్నాడు.

డాలర్ల ఎర: ఏప్రిల్ 4న ఆ కేటుగాడు మోహన్ కుమార్‌కు మళ్ళీ మెసేజ్ చేసి, తాను ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నానని చెప్పాడు. తాను తెచ్చిన 2,50,000 యూఎస్ డాలర్లను అక్కడి కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారని నమ్మించాడు. ఆ డబ్బును విడిపించడానికి 'క్లియరెన్స్ ఫీజు' కడితే, విడుదలైన డాలర్లలో పెద్ద మొత్తాన్ని వాటాగా ఇస్తానని ఆశ పెట్టాడు.

₹21.37 లక్షల దోపిడీ

మోహన్ కుమార్ ఆ మాటలను నిజమని నమ్మి, ఏప్రిల్ 4 నుండి ఏప్రిల్ 15 మధ్య పలు విడతలుగా నిందితులు చెప్పిన బ్యాంకు ఖాతాలకు మొత్తం ₹21,37,000 బదిలీ చేశాడు.

డబ్బులు పంపడం ఆపేసిన తర్వాత నిందితుల ఫోన్లు స్విచ్ఛాఫ్ అవ్వడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు మదనపల్లె పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసులు రంగంలోకి దిగి నిందితుల అరెస్ట్

మదనపల్లె డీఎస్పీ బి. పావని పర్యవేక్షణలో తాలూకా సీఐ కె. కళా వెంకటరమణ, ఎస్ఐ రామకృష్ణారెడ్డి సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు.హైదరాబాద్‌లో ఉంటూ ఈ నేరాలకు పాల్పడుతున్న అసోంకు చెందిన సూరజిత్ చేతియా, త్రిపురకు చెందిన అహోత్లియన్ కైపెంగ్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు తట్టివారిపల్లె క్రాస్ వద్ద అరెస్ట్ చేశారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుల నుంచి ₹2 లక్షల నగదు, 3 మొబైల్ ఫోన్లు, 57 బ్యాంక్ పాస్‌బుక్కులు, 35 ఏటీఎం కార్డులు, మరియు 49 చెక్కు బుక్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి