Breaking News

గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో

గుడ్ న్యూస్.. ఇక 9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ పూర్తి షెడ్యూల్ ఇదిగో


Published on: 15 Dec 2025 10:28  IST

కోస్తా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య ప్రయాణ సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కొత్త రూట్‌లో పరుగులు తీయనుంది. డిసెంబర్ 15 నుంచి ఈ రైలు ప్రయాణం ప్రారంభం కానుంది. ఇప్పటివరకు చెన్నై సెంట్రల్ నుంచి విజయవాడ వరకు మాత్రమే పరిమితమైన ఈ సెమీ హైస్పీడ్ రైలును తాజాగా నరసాపూర్ వరకు పొడిగించారు.

ఈ మార్గ విస్తరణతో భీమవరం, గుడివాడ ప్రాంతాల ప్రయాణికులకు కూడా ఆధునిక ఏసీ రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. నరసాపూర్ నుంచి చెన్నై వరకు ఉన్న 655 కిలోమీటర్ల దూరాన్ని ఈ వందే భారత్ రైలు సుమారు 9 గంటల్లో పూర్తి చేస్తుంది. మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు ఈ సేవలు కొనసాగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.

ఈ రోజు చెన్నై సెంట్రల్ – నరసాపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను లాంఛనంగా ప్రారంభించనుండగా, డిసెంబర్ 17 నుంచి ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

వాణిజ్యం, ప్రయాణాలకు ఊతం

నరసాపూర్ – చెన్నై మధ్య మొదటిసారిగా వందే భారత్ రైలు నడవడం వల్ల ఈ రూట్‌లో వాణిజ్య కార్యకలాపాలు మరింత చురుకుగా మారనున్నాయి. రోజువారీ ప్రయాణికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులకు ఈ రైలు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. ఈ రైలు 8 గంటల 55 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు.

ఈ రూట్‌లో రైలు
రేణిగుంట జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ స్టేషన్లలో ఆగనుంది.

రైలు టైమింగ్‌లు

  • నరసాపూర్ నుంచి చెన్నైకి:
    మధ్యాహ్నం 2:50 గంటలకు బయలుదేరి, రాత్రి 11:45 గంటలకు డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది.

  • చెన్నై నుంచి నరసాపూర్‌కు:
    ఉదయం 5:30 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 2:10 గంటలకు నరసాపూర్ చేరుకుంటుంది.

టికెట్ ధరలు

  • ఏసీ చైర్ కార్: రూ. 1,635

  • ఎగ్జిక్యూటివ్ చైర్ కార్: రూ. 3,030

ఆధునిక సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణంతో ప్రయాణికులకు ప్రీమియం అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ వందే భారత్ రైలును రూపొందించారు.

Follow us on , &

ఇవీ చదవండి