Breaking News

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో భారీ లాడిల్ పేలుడు ప్రమాదం ఘటన 8 మంది కార్మికుల మృతి

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జూన్ 8, 2026 సాయంత్రం సుమారు 4:15 గంటలకు భారీ లాడిల్ పేలుడు ప్రమాదం సంభవించింది, ఈ ఘటనలో 8 మంది కార్మికులు మరణించారు మరియు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.


Published on: 10 Jun 2026 10:16  IST

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో జూన్ 8, 2026 సాయంత్రం సుమారు 4:15 గంటలకు భారీ లాడిల్ పేలుడు ప్రమాదం సంభవించింది, ఘటనలో 8 మంది కార్మికులు మరణించారు మరియు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

స్టీల్ మెల్టింగ్ షాప్-1 (SMS-1) లోని కంటిన్యూయస్ కాస్టింగ్ డిపార్ట్‌మెంట్ (CCD) పరిధిలో గల మెషిన్-2 వద్ద ఈ దుర్ఘటన జరిగింది.సుమారు 1,500 నుండి 1,600 డిగ్రీల సెల్సియస్ అత్యధిక వేడితో ఉన్న 150 టన్నుల ద్రవ ఉక్కును తరలిస్తున్న సమయంలో లాడిల్ ఒక్కసారిగా పేలిపోయింది.ప్రాథమిక నివేదికల ప్రకారం, ద్రవ ఉక్కులో ఏర్పడిన వాయువుల ఒత్తిడి వల్ల ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని ఫ్యాక్టరీల శాఖ పేర్కొంది.పేలుడు ధాటికి పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడి పైకప్పు వరకు వ్యాపించాయి, అక్కడ ఉన్న ఓవర్‌హెడ్ క్రేన్ కూడా పూర్తిగా తగలబడింది.

వేడి ద్రవ ఉక్కు శరీరంపై పడటంతో ఐదుగురు శాశ్వత ఉద్యోగులు, ముగ్గురు కాంట్రాక్ట్ కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో కేజీహెచ్ (KGH) ఆసుపత్రిలో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.తీవ్రంగా గాయపడిన ఆరుగురు కార్మికులను నగరంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి మృతుల కుటుంబాలకు ₹25 లక్షల ఎక్స్‌గ్రేషియా మరియు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మృతుల కుటుంబాలకు ₹2 లక్షలు, గాయపడిన వారికి ₹50 వేల సహాయాన్ని ప్రకటించారు.

బొకారో స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ ఇన్‌చార్జ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ ప్లాంట్‌లో భద్రతా లోపాలు మరియు యాజమాన్య నిర్లక్ష్యంపై పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించింది

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత తదితరులు ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

 

Follow us on , &

ఇవీ చదవండి