Breaking News

ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై పన్ను కోత.. యోచనలో జీఎస్‌టీ కౌన్సిల్

ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్‌పై పన్ను కోత.. యోచనలో జీఎస్‌టీ కౌన్సిల్


Published on: 03 Jan 2026 10:51  IST

దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం, నీటి కాలుష్యం సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక అంశంపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఎయిర్‌ ప్యూరిఫైయర్లు, వాటర్‌ ప్యూరిఫైయర్లపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్‌టీ రేటును గణనీయంగా తగ్గించే అంశాన్ని జీఎస్‌టీ మండలి పరిశీలించనున్నట్టు తెలుస్తోంది. ఈ ఉత్పత్తులను అత్యవసర అవసరాల కేటగిరీలోకి తీసుకువచ్చి జీఎస్‌టీని 5 శాతానికి పరిమితం చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగే అవకాశం ఉంది.

ధరలు తగ్గితే వినియోగదారులకు లాభం

జీఎస్‌టీ తగ్గింపు అమలులోకి వస్తే, మార్కెట్లో ఎయిర్‌, వాటర్‌ ప్యూరిఫైయర్ల ధరలు సుమారు 10 నుంచి 15 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని వల్ల మధ్యతరగతి, సామాన్య కుటుంబాలకు ఈ పరికరాలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఇది పెద్ద ఊరటగా మారనుంది.

జీఎస్‌టీ మండలి సమావేశంపై ఎదురుచూపులు

అయితే, తదుపరి జీఎస్‌టీ మండలి సమావేశం ఎప్పుడు జరగనుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో చివరిసారిగా సమావేశమైన జీఎస్‌టీ మండలి, ఆ సమయంలో ఎయిర్‌, వాటర్‌ ప్యూరిఫైయర్లపై పన్ను తగ్గింపునకు అంగీకరించలేదు. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మధ్య పూర్తి స్థాయి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అప్పట్లో జీఎస్‌టీని యథాతథంగా కొనసాగించారు.

కోర్టు సూచనలు, రాజకీయ ఒత్తిడి

ఇటీవల ఢిల్లీలో వాయు నాణ్యత తీవ్రంగా దిగజారడంతో ఈ అంశంపై మళ్లీ చర్చ మొదలైంది. ఢిల్లీ హైకోర్టు కూడా ఈ విషయంపై స్పందించింది. ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించలేని పరిస్థితుల్లో కనీసం ఎయిర్‌ ప్యూరిఫైయర్లపై జీఎస్‌టీని తగ్గించాలంటూ ప్రభుత్వానికి సూచించింది. ఈ పరికరాలను వైద్య అవసరాలకు సంబంధించిన వస్తువులుగా పరిగణించి పన్ను తగ్గించాలన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

అదే సమయంలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎయిర్‌ ప్యూరిఫైయర్లపై జీఎస్‌టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. కనీసం 5 శాతానికి అయినా పరిమితం చేయాలని వ్యాపార, వినియోగదారుల వర్గాలు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

తుదినిర్ణయం కోసం ఎదురుచూపులు

వాయు, నీటి కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ఈ అంశంపై జీఎస్‌టీ మండలి సానుకూల నిర్ణయం తీసుకుంటే అది కోట్లాది కుటుంబాలకు ఉపయోగపడనుంది. ఇప్పుడు అందరి దృష్టి జీఎస్‌టీ మండలి తదుపరి సమావేశంపైనే ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి