Breaking News

ఉచిత బస్సు ప్రయాణానికి పింక్ టికెట్లు… ఆధార్‌ లింక్‌తో పింక్ పాస్‌ తెస్తామన్న ఢిల్లీ సీఎం

ఉచిత బస్సు ప్రయాణానికి పింక్ టికెట్లు… ఆధార్‌ లింక్‌తో పింక్ పాస్‌ తెస్తామన్న ఢిల్లీ సీఎం


Published on: 18 Jul 2025 09:11  IST

ఢిల్లీ ప్రభుత్వం మహిళల ప్రయాణానికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు, ప్రస్తుతం అందిస్తున్న పింక్ టికెట్లను స్థానంలో త్వరలోనే పింక్ పాస్‌లు అందించనున్నట్లు ప్రకటించింది. దీనిపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్పందిస్తూ, ఈ పాస్‌లు ఆధార్‌తో అనుసంధానం చేసి, కేవలం ఢిల్లీ నివాసితులకు మాత్రమే ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

పింక్ పాస్ కోసం దరఖాస్తు చేయాలంటే ఆధార్, పాన్ కార్డ్, నివాస రుజువు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోతోపాటు పూర్తి KYC డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. రవాణా మంత్రి పంకజ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం, డిజిటల్ మరియు పరిపాలనా వ్యవస్థల రూపకల్పన జరుగుతున్నది. అర్హతను నిర్ధారించేందుకు ఆధార్ ప్రాథమిక గుర్తింపు పత్రంగా ఉపయోగపడనుంది.

2019లో ప్రవేశపెట్టిన పింక్ టికెట్ స్కీమ్‌కు ఢిల్లీ మహిళల నుండి భారీ స్పందన లభించిందని అధికారులు తెలిపారు. లక్షల మంది మహిళలు ఈ సౌకర్యాన్ని ప్రతిరోజూ వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే పింక్ టికెట్ల పద్ధతి ఓపెన్-యాక్సెస్ విధానంగా ఉండటంతో, దుర్వినియోగం జరగుతున్నట్టు గుర్తించారు. ఢిల్లీకి చెందినవారు కాకపోయినప్పటికీ, కొంతమంది వ్యక్తులు కూడా ఈ ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు.

అధికారుల తనిఖీల్లో టిక్కెట్ల సంఖ్య భారీగా పెరగడం, ప్రయాణికుల డేటాలో అసమానతలు ఉండటం వంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది అవినీతి ఆరోపణలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం పింక్ టికెట్ల స్థానంలో పింక్ పాస్‌లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ పద్ధతిని దశలవారీగా అమలు చేయనున్నారు. అయితే అంతవరకూ ఇప్పటి ఉన్న పింక్ టికెట్ల ద్వారా మహిళలు ఉచిత ప్రయాణాన్ని కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి