Breaking News

రైలు బండి.. విద్యార్థులకు రాయితీలు దండి

రైలు బండి.. విద్యార్థులకు రాయితీలు దండి


Published on: 08 Dec 2025 10:53  IST

బస్సుల్లాగే రైల్వే ప్రయాణంలో కూడా విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయని చాలామందికి ఇప్పటికీ పూర్తిగా తెలియదు. కరోనా సమయంలో ఈ సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన రైల్వే శాఖ, దాదాపు రెండేళ్ల క్రితమే మళ్లీ విద్యార్థుల ప్రయాణ రాయితీలను ప్రారంభించింది. అయితే అవగాహన లోపంతో చాలా మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోక, సాధారణ ఛార్జీలతోనే ప్రయాణిస్తూ అదనపు ఖర్చు భరించాల్సి వస్తోంది.

ప్రత్యేకంగా దసరా, సంక్రాంతి వంటి పండుగలు, సెమిస్టర్ సెలవులు, వేసవి సెలవుల సమయంలో ఇంటికి వెళ్లి రావాల్సిన విద్యార్థులకు ఈ రాయితీలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇందుకోసం వారు తమ కళాశాల లేదా యూనివర్సిటీ యాజమాన్యం నుంచి చదువుతున్నట్టు ధృవీకరించే పత్రాన్ని పొందాలి.

ఆ పత్రంతో సంబంధిత డివిజన్ రైల్వే మేనేజర్ (DRM) కార్యాలయంలోని సీనియర్ డీసీఎం విభాగాన్ని సంప్రదించాలి. అక్కడ అధికారులు చెప్పిన విధంగా అవసరమైన పత్రాలు సమర్పిస్తే, రైల్వే శాఖ నుండి అధికారిక సంతకాలతో కూడిన ప్రయాణ రాయితీ బుక్‌ను జారీ చేస్తారు. ఈ సమాచారాన్ని సంబంధిత రైల్వే స్టేషన్‌కు తెలియజేయడంతో పాటు, విద్యార్థి తన కాలేజ్‌ ప్రిన్సిపల్‌ నుంచి ట్రావెల్ లెటర్ తీసుకుని టికెట్ రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.

ఎంత రాయితీ లభిస్తుంది అంటే..
సాధారణ విద్యార్థులకు టికెట్ ధరపై 50 శాతం తగ్గింపు లభిస్తుండగా, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులకు 75 శాతం వరకు రాయితీ అందిస్తున్నారు. అయితే ఈ సౌకర్యం కేవలం ఆఫ్‌లైన్‌లో తీసుకునే టికెట్లకే వర్తిస్తుంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసిన టికెట్లకు ఇది అమలుకాదు. అలాగే ఈ రాయితీలు జనరల్, స్లీపర్ తరగతులకు మాత్రమే వర్తిస్తాయి. ఏసీ కోచ్‌లకు ఈ సదుపాయం లేదు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చదువుకుంటున్న విద్యార్థులు సొంత ఊరికి తక్కువ ఖర్చుతో వెళ్లి రావడానికి ఈ రాయితీ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే విద్యార్థులు ముందుగానే దీనిపై సమాచారం తెలుసుకుని, రైల్వే అందిస్తున్న ఈ వెసులుబాటును పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి