Breaking News

నార్వే జర్నలిస్టు ప్రశ్నతో అంతర్జాతీయ వేదికపై కలకలం..!

భారత్‌లో మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛపై నార్వే జర్నలిస్టు అడిగిన ప్రశ్న రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రధాని మోదీ స్పందించకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ కొనసాగుతోంది.


Published on: 20 May 2026 10:36  IST

నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన మీడియా కార్యక్రమం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ చర్చకు కారణమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌తో కలిసి పాల్గొన్న కార్యక్రమంలో నార్వే జర్నలిస్టు హెలె లెంగ్ స్వెండ్సెన్ అడిగిన ప్రశ్న రాజకీయంగా దుమారం రేపింది. భారత్‌లో మానవ హక్కుల పరిస్థితి, పత్రికా స్వేచ్ఛపై ప్రశ్నించేందుకు ఆమె ప్రయత్నించగా, ప్రధాని మోదీ స్పందించకుండా వెళ్లిపోయారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఈ కార్యక్రమానికి ముందు నుంచే ప్రశ్నలు-జవాబుల సెషన్ ఉండదని నిర్వాహకులు స్పష్టం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ కార్యక్రమం ముగిసే సమయంలో స్వెండ్సెన్ బిగ్గరగా ప్రశ్న అడగడానికి ప్రయత్నించారు. అయితే ఇరు దేశాల ప్రధానులు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం “మోదీ నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు” అంటూ వీడియోతో కలిసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విషయం వైరల్ అయింది.

ఈ ఘటన తర్వాత ఓస్లోలోని భారత రాయబార కార్యాలయం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి కూడా హెలె లెంగ్ స్వెండ్సెన్ హాజరై భారత విదేశాంగ ప్రతినిధి సిబి జార్జ్‌ను నేరుగా ప్రశ్నించారు. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నప్పుడు ఆ దేశాన్ని ప్రపంచం ఎలా విశ్వసించాలనే ప్రశ్న ఆమె లేవనెత్తారు.

దీనికి స్పందించిన సిబి జార్జ్‌, భారత్ ప్రపంచంలోని అనేక దేశాలతో విశ్వసనీయ భాగస్వామ్య సంబంధాలు కొనసాగిస్తోందని వివరించారు. జి-20 సదస్సు, ఇటీవల నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వంటి అంతర్జాతీయ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. కోవిడ్ సమయంలో ప్రపంచంలోని వందకు పైగా దేశాలకు భారత్ వ్యాక్సిన్లు, వైద్య సహాయం అందించిందని పేర్కొన్నారు. అదే ప్రపంచం భారత్‌పై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని తెలిపారు.

అయితే స్వెండ్సెన్ మళ్లీ తాను అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వాలని కోరారు. దీనిపై సిబి జార్జ్ గట్టిగా స్పందిస్తూ, “భారత్‌ను ఎందుకు విశ్వసించాలో వివరిస్తున్నాను.. మధ్యలో అడ్డుకోవద్దు” అని అన్నారు. భారత్‌కు వేల సంవత్సరాల నాగరిక చరిత్ర ఉందని, ప్రపంచం కోవిడ్ సంక్షోభంలో ఉన్నప్పుడు భారత్ చేసిన సహాయం విశ్వాసానికి బలమైన ఉదాహరణ అని చెప్పారు.

మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రచురించే నివేదికల ఆధారంగా మాత్రమే భారత్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి న్యాయం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కల్పిస్తుందని, ఎవరి హక్కులు ఉల్లంఘనకు గురైనా కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని గుర్తుచేశారు.

అయితే ఈ వివరణలతో స్వెండ్సెన్ సంతృప్తి చెందలేదు. తాను, తన సహచర జర్నలిస్టులు మానవ హక్కుల అంశంపై స్పష్టమైన సమాధానాలు రాబట్టేందుకు ప్రయత్నించామని, కానీ భారత ప్రతినిధులు ఎక్కువగా కోవిడ్ సేవలు, యోగా, అంతర్జాతీయ గుర్తింపు వంటి అంశాల గురించే మాట్లాడారని మరో పోస్టులో వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారం రాజకీయ రంగు దాల్చడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. అంతర్జాతీయ వేదికలపై ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోవడం దేశ ప్రతిష్ఠకు మంచిది కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు సోషల్ మీడియాలో హెలె లెంగ్ స్వెండ్సెన్‌పై భారీగా ట్రోలింగ్ జరిగింది. కొందరు ఆమెను విమర్శిస్తుండగా, మరికొందరు జర్నలిస్టుగా ప్రశ్నలు అడగడం సహజమని మద్దతు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement