Breaking News

యూఏఈకి చెందిన ఏకైక బరాకా అణువిద్యుత్ కేంద్రం లక్ష్యంగా ఆదివారం డ్రోన్ దాడి జరిగింది

యూఏఈ (UAE) కి చెందిన ఏకైక బరాకా అణువిద్యుత్ కేంద్రం లక్ష్యంగా ఆదివారం (మే 17, 2026) ఒక డ్రోన్ దాడి జరిగింది. వెస్ట్ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది.


Published on: 18 May 2026 11:58  IST

యూఏఈ (UAE) కి చెందిన ఏకైక బరాకా అణువిద్యుత్ కేంద్రం లక్ష్యంగా ఆదివారం (మే 17, 2026) ఒక డ్రోన్ దాడి జరిగింది. వెస్ట్ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది.

అబుదాబిలోని అల్ దఫ్రా ప్రాంతంలో ఉన్న బరాకా అణువిద్యుత్ ప్లాంట్ లోపలి సరిహద్దు వెలుపల ఉన్న ఒక ఎలక్ట్రికల్ జనరేటర్‌పై డ్రోన్ దూసుకురావడంతో అక్కడ మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అలాగే ఎలాంటి రేడియేషన్ లీకేజీ (రేడియోధార్మికత) జరగలేదని యూఏఈ అణు నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. ప్లాంట్‌లోని అన్ని యూనిట్లు సురక్షితంగా, యథావిధిగా పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.తమ దేశ పశ్చిమ సరిహద్దు గుండా మొత్తం 3 డ్రోన్లు రాగా, వాటిలో రెండింటిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ విజయవంతంగా అడ్డుకున్నాయని, ఒకటి మాత్రం జనరేటర్ సమీపంలో పడిందని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ దాడిని భారతదేశం తీవ్రంగా ఖండించింది. పౌర అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకోవడం అత్యంత ప్రమాదకరమైన చర్య అని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత విదేశాంగ శాఖ (MEA) ఆందోళన వ్యక్తం చేసింది. అన్ని పక్షాలు సమయమనం పాటించి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చింది.అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) డైరెక్టర్ జనరల్ రాఫెల్ గ్రాస్సీ ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, అణు కేంద్రాల వద్ద సైనిక చర్యలు తగవని హెచ్చరించారు.గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆందోళనలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో కరుడు ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ లేదా దేశం అధికారికంగా ప్రకటించలేదు. అయితే, యూఏఈ మాత్రం ఇది అకారణంగా జరిగిన ఉగ్రదాడి అని అభివర్ణించింది. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ లేదా దాని మద్దతు ఉన్న శక్తులు (ప్రాక్సీలు) ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. తమ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తే సైనికంగా, దౌత్యపరంగా సమాధానం చెప్పే హక్కు తమకు ఉందని యూఏఈ హెచ్చరించింది.

 

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement