Breaking News

పెళ్ళికి నిరాకరణ నడిరోడ్డుపైన మహిళ హత్య

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కారణంతో కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన జాలెం టీనా రోజా (31) అనే మహిళను, ఆమె పాత స్నేహితుడు మార్గాని రమేష్ జాతీయ రహదారిపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.


Published on: 22 Jun 2026 18:39  IST

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కారణంతో కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన జాలెం టీనా రోజా (31) అనే మహిళను, ఆమె పాత స్నేహితుడు మార్గాని రమేష్ జాతీయ రహదారిపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.

మృతురాలు టీనా రోజా (31) డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి గ్రామానికి చెందిన మహిళ. ఆమె ఏఎన్‌ఎం కోర్సు పూర్తి చేసి సూళ్లూరుపేటలో (శ్రీహరికోట) అప్రెంటిస్ నర్సుగా శిక్షణ పొందుతోంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆదివారం ఉదయం ఆమె రైలులో నరసాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆమెను ఊరికి తీసుకువెళ్లేందుకు సఖినేటిపల్లికి చెందిన డ్రైవర్ అంగర సురేష్ బాబు కారుతో వచ్చాడు. వారు కారులో బయలుదేరగా, మార్గమధ్యంలో అదే గ్రామానికి చెందిన పాత స్నేహితుడు మార్గాని రమేష్ కూడా వారి కారు ఎక్కాడు.

కారులో ప్రయాణిస్తున్న సమయంలో రమేష్ తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది.నరసాపురం-పాలకొల్లు 216 జాతీయ రహదారి లాక్‌పేటలోని ఓ పెట్రోల్ బంక్ సమీపంలో వాటర్ బాటిల్ కోసం కారు ఆపారు. రోజా కారు దిగి తిరిగి ఎక్కుతున్న సమయంలో, రమేష్ కత్తితో ఆమె ఛాతి, పొట్ట భాగాల్లో విచక్షణారహితంగా పొడిచాడు.

రోజాను కాపాడేందుకు అడ్డువచ్చిన కారు డ్రైవర్ సురేష్ బాబుపై కూడా నిందితుడు రమేష్ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.తీవ్ర రక్తస్రావమైన రోజాను పోలీసులు నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ సురేష్ బాబు ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఘటనపై సమాచారం అందుకున్న నరసాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ సురేష్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసాపురం టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు మార్గాని రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి