Breaking News

దుబాయ్‌లోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జెబెల్ అలీ లో బుధవారం తెల్లవారుజామున కేవలం 20 నిమిషాల వ్యవధిలో వరుసగా 7 భారీ పేలుళ్లు సంభవించాయి

దుబాయ్‌లోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జెబెల్ అలీ లో బుధవారం (ఆగస్టు 5, 2026) తెల్లవారుజామున కేవలం 20 నిమిషాల వ్యవధిలో వరుసగా 7 భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా దుబాయ్ నగరం దద్దరిల్లింది.


Published on: 05 Aug 2026 14:59  IST

దుబాయ్‌లోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన జెబెల్ అలీ లో బుధవారం (ఆగస్టు 5, 2026) తెల్లవారుజామున కేవలం 20 నిమిషాల వ్యవధిలో వరుసగా 7 భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనతో ఒక్కసారిగా దుబాయ్ నగరం దద్దరిల్లింది. పేలుళ్ల తీవ్రతకు ఆకాశాన్ని దట్టమైన నల్లటి పొగ కమ్మేసింది. దుబాయ్ డౌన్‌టౌన్‌కు నైరుతి దిశలో ఉన్న వ్యూహాత్మక పారిశ్రామిక, లాజిస్టిక్స్ హబ్ జెబెల్ అలీ ప్రాంతంలో ఈ పేలుళ్లు జరిగాయి.

స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున దాదాపు 2:40 గంటలకు ఈ శబ్దాలు వినిపించాయి. నివాస ప్రాంతాల సమీపంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి.

ఇది కేవలం ఒక పారిశ్రామిక ప్రమాదమా? లేదా ప్రాంతీయ ఉద్రిక్తతల (ఇరాన్ - అమెరికా ఘర్షణలు లేదా యెమెన్‌ హౌతీల మిస్సైల్ దాడి) వల్ల జరిగిందా? అనే దానిపై యూఏఈ ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఈ ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఘటనను వీడియో తీసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదించింది.

ఇప్పటివరకు ఈ ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు.యూఏఈ అధికారిక దర్యాప్తు సంస్థల నివేదిక వచ్చిన తర్వాతే ఈ వరుస పేలుళ్లకు అసలైన కారణం స్పష్టమవుతుంది.

Follow us on , &

ఇవీ చదవండి