Breaking News

సంక్రాంతి ప్రయాణికులకు గుడ్‌న్యూస్… ఏపీ వెళ్లేవారికి అదనపు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి ప్రయాణికులకు గుడ్‌న్యూస్… ఏపీ వెళ్లేవారికి అదనపు ప్రత్యేక రైళ్లు


Published on: 13 Jan 2026 10:27  IST

సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో జరుపుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. పండుగ రద్దీని ముందుగానే అంచనా వేసిన దక్షిణ మధ్య రైల్వే, ఇప్పటికే పలువురు ప్రయాణికులకు ఉపశమనం కలిగేలా ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. జనవరి 10 నుంచి ఈ స్పెషల్ ట్రైన్లు సేవల్లోకి వచ్చాయి.

హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ తదితర ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ భారీగా ఉండటంతో, నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రయాణికులకు మరింత ఊరటనిచ్చేలా రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 12 జన్ సాధారణ్ ప్రత్యేక రైళ్లను అదనంగా నడపనున్నట్లు ప్రకటించింది.

విజయవాడ–విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు

విజయవాడ–విశాఖపట్నం మార్గంలో ఈ 12 జన్ సాధారణ్ స్పెషల్ ట్రైన్లు జనవరి 12 నుంచి 18 వరకు అందుబాటులో ఉండనున్నాయి.
విశాఖపట్నం–విజయవాడ (08567), విజయవాడ–విశాఖపట్నం (08568) రైళ్లు జనవరి 12, 13, 14, 16, 17, 18 తేదీల్లో నడుస్తాయి.

  • విశాఖపట్నం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరే రైలు సాయంత్రం 4 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.

  • విజయవాడ నుంచి సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరే రైలు తదుపరి రోజు మధ్యాహ్నం 12.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

ఈ స్టేషన్లలో ఆగుతాయి

ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్లలో నిలుస్తాయి. దీంతో మధ్యలోని పట్టణాలు, గ్రామాల ప్రయాణికులకు కూడా ఈ రైళ్లు ఉపయోగపడనున్నాయి.

తిరుపతి, కాకినాడ–చర్లపల్లి స్పెషల్ ట్రైన్లు

ఇక జనవరి 18, 19 తేదీల్లో తిరుపతి–చర్లపల్లి, కాకినాడ–చర్లపల్లి మధ్య కూడా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.

  • తిరుపతి–చర్లపల్లి (07483) రైలు 18వ తేదీ రాత్రి 9.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు చేరుకుంటుంది.

  • చర్లపల్లి–తిరుపతి (07482) రైలు ఆదివారం ఉదయం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 7 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

  • చర్లపల్లి–కాకినాడ టౌన్ (07480) ఉదయం 10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు చేరుకుంటుంది.

  • కాకినాడ–చర్లపల్లి (07481) రైలు రాత్రి 11.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు చేరుకుంటుంది.

జనవరి 13న మరిన్ని ప్రత్యేక రైళ్లు

జనవరి 13న కూడా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు సేవలు అందించనున్నాయి. తిరుపతి–చర్లపల్లి, అనకాపల్లి–సికింద్రాబాద్, హైదరాబాద్–భువనేశ్వర్, షాలిమార్–చర్లపల్లి, సికింద్రాబాద్–నర్సాపూర్ రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్–కాకినాడ, శ్రీకాకుళం–సికింద్రాబాద్, వికారాబాద్–శ్రీకాకుళం, లింగంపల్లి–కాకినాడ ప్రత్యేక రైళ్లు కూడా అదే రోజు అందుబాటులో ఉంటాయి.

పండుగ రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీకి వెళ్లే ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement