Breaking News

టెర్రరిస్టులకు సాయం నిలిపేస్తేనే .. పాక్​కు సింధు జలాలు

టెర్రరిస్టులను పాకిస్తాన్ పెంచిపోషిస్తున్నంత వరకు సింధు జలాల ఒప్పందంపై సస్పెన్షన్ కొనసాగుతుందన్న విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్


Published on: 14 May 2025 08:01  IST

న్యూఢిల్లీ: టెర్రరిస్టులను పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నంతకాలం, సింధూ నదీ జలాల ఒప్పందంపై భారత ప్రభుత్వం అనుకూలంగా స్పందించదు అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టంగా తెలిపారు. ఉగ్రవాదానికి పూర్తి విరమణ చేయకపోతే, పాకిస్తాన్ ఈ ఒప్పంద ప్రయోజనాల గురించి మరిచిపోవాలన్నారు.

పాకిస్తాన్ నుండి క్రాస్ బార్డర్ టెర్రరిజం (అంటే సరిహద్దులపై ఉగ్రవాద దాడులు) పూర్తిగా ఆగాలి అని భారత్ స్పష్టం చేసింది. భారత భద్రతను లక్ష్యం చేసి ఉగ్రదాడులు మళ్లీ జరిగితే, దీనికి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది.సింధూ జలాల ఒప్పందం అమలు పాక్ ధోరణిపైనే ఆధారపడింది అని జైస్వాల్ పేర్కొన్నారు. ఈ ఒప్పందంపై ఏప్రిల్ 23న కేంద్ర కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ తీసుకున్న నిర్ణయమే ప్రస్తుతం అమలులో ఉంది.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) పై కూడా భారత్ తన స్థిరమైన వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. "అది మన భూభాగమే. దానిని ఖాళీ చేయించుకోవడమే మన లక్ష్యం" అని జైస్వాల్ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో బహుళ దేశాల మధ్యవర్తిత్వానికి తావులేదని తెలిపారు. రెండు దేశాలు ఎదురెదురుగా మాట్లాడితేనే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత ప్రభుత్వం ఉగ్రవాద స్థావరాలపై ధాటిగా దాడులు చేసింది. పాక్ తరపున పహల్గాం దాడికి పాల్పడిన TRF సంస్థ లష్కరే తోయిబా అనుబంధమే అని గుర్తించారు. ఈ సంస్థపై అంతర్జాతీయ నిషేధం విధించేందుకు భారత్ చర్యలు తీసుకుంటోంది. పాకిస్తాన్ తన పరాజయాన్ని కూడా విజయంగా చెప్పుకుంటూ తప్పుడు ప్రచారాలు చేస్తోందని విదేశాంగ ప్రతినిధి విమర్శించారు. ఆదంపూర్ ఎయిర్ బేస్‌పై దాడి చేశామని పాక్ చేసిన హడావుడి అసత్యమని తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా ఆదంపూర్ ఎయిర్ బేస్‌ను సందర్శించారని, అక్కడ ఎలాంటి నష్టం జరగలేదని ప్రపంచ దేశాలన్నీ చూశాయన్నారు.

ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న టైమ్​లో ఇండియా, అమెరికా లీడర్లు మాట్లాడుకున్నారు. ఇందులో వాణిజ్యపరమైన అంశాలపై చర్చ జరగలేదు. , భద్రతాసంబంధిత విషయాలపైనే చర్చలు జరిగాయని పేర్కొన్నారు. ఇకపై పాక్‌తో ఎలాంటి చర్చలు  జరిగినా అవి ఉగ్రవాదం, పీవోకే గురించి మాత్రమే ఉంటాయని భారత్ స్పష్టం చేసింది.

 

Follow us on , &

ఇవీ చదవండి