Breaking News

పహల్గాం ఉగ్రదాడి.. టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా

పహల్గాం ఉగ్ర దాడికి సంబంధించి అగ్రరాజ్యం అమెరికా (USA) కీలక నిర్ణయం.


Published on: 18 Jul 2025 08:45  IST

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, ఈ దాడికి బాధ్యత వహించిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (TRF) అనే సంస్థను అమెరికా అధికారికంగా ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. TRF అనే సంస్థ, పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ముసుగు గ్రూప్‌గా ఉన్నదని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, TRFను విదేశీ ఉగ్రవాద సంస్థగా (FTO), అలాగే ప్రత్యేకంగా గుర్తించిన అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ (SDGT)గా గుర్తించినట్లు తెలిపారు.

మార్కో రూబియో మాట్లాడుతూ, తమ దేశ భద్రతను కాపాడటమే కాకుండా, పహల్గాం దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనకు న్యాయం చేయాలనే లక్ష్యంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ చర్యతో అమెరికా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము తీసుకుంటున్న గట్టిపట్టు స్పష్టమవుతోందన్నారు. ఆయన ప్రకారం, 2008 ముంబయి దాడి తర్వాత భారత్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో ఇది ఒక తీవ్రమైన ఘటనగా పరిగణించబడుతోందని వెల్లడించారు. TRF గతంలో భారత భద్రతా సిబ్బందిపై జరిపిన పలుదాడులకు కూడా బాధ్యత వహించిందని పేర్కొన్నారు.

ఈ చర్యను భారత్‌ స్వాగతించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్‌-అమెరికా మధ్య ఉన్న బలమైన భాగస్వామ్యానికి ఇది మరో ఉదాహరణగా నిలుస్తుందని భారత రాయబార కార్యాలయం తెలిపింది. TRF ఉగ్రవాద సంస్థగా గుర్తింపు పొందడాన్ని ప్రశంసిస్తూ, ఈ సంస్థ అనేక అమాయకుల ప్రాణాలను హరించిన ఘటనలను గుర్తు చేసింది. లష్కరే తోయిబా ముసుగులో TRF పర్యాటకులను, ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసిన విషయాన్ని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ సహించరాదని భారత్‌ తేల్చిచెప్పింది.

పహల్గాం దాడి అనంతరం, భారత్‌ "ఆపరేషన్ సిందూర్" పేరిట ప్రత్యేక చర్యలు చేపట్టి, పాక్‌ ఆధారిత ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. ఈ చర్యలు దేశ భద్రతను కాపాడటంలో భారత్‌ తీసుకున్న గంభీరమైన ప్రతిస్పందనగా నిలిచాయి.

Follow us on , &

ఇవీ చదవండి