Breaking News

ఈవీపై చైనా ఉడుంపట్టు: బ్యాటరీ టెక్నాలజీలపై ఆంక్షలు..!

చైనా విద్యుత్తు వాహనాల మార్కెట్‌ను తన ఆధీనంలో ఉంచేందుకు కృషి. ఈవీ వాహనాల్లో కీలకమైన బ్యాటరీ టెక్నాలజీపై తన నియంత్రణను మరింత బలపరచే దిశగా పావులు కదుపుతోంది.


Published on: 18 Jul 2025 16:44  IST

చైనా విద్యుత్తు వాహనాల మార్కెట్‌ను తన ఆధీనంలో ఉంచేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. ముఖ్యంగా ఈవీ వాహనాల్లో కీలకమైన బ్యాటరీ టెక్నాలజీపై తన నియంత్రణను మరింత బలపరచే దిశగా పావులు కదుపుతోంది. ఇటీవల ఎనిమిది రకాల బ్యాటరీల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేయడంపై ఆంక్షలు విధించింది. ఇప్పటినుంచి ఈ టెక్నాలజీ ఆధారంగా తయారైన బ్యాటరీల్ని విదేశాలకు పంపే ముందు చైనా ప్రభుత్వ అనుమతి అవసరం అవుతుంది. ఈ చర్య ద్వారా చైనా తాను అభివృద్ధి చేసిన సాంకేతికతను దేశంలోనే పరిమితం చేయాలని చూస్తోంది.

ఈ ఆంక్షల్లో ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీలో కీలకమైన భాగమైన కాథోడ్స్ తయారీకి ఉపయోగించే టెక్నాలజీపై ఆంక్షలు ఉన్నాయి. ఇందులో లిథియం ఫాస్ఫేట్ (LFP), లిథియం మాంగనీస్ ఐరన్ ఫాస్ఫేట్ (LMFP) వంటి పదార్థాల తయారీకి ఉపయోగించే పద్ధతులు, పనితీరు కొలిచే ప్రమాణాలు, ఇతర రసాయనాల వివరాలు బయటకు పొక్కకుండా చైనా చర్యలు తీసుకుంటోంది. అదనంగా, సెమీకండక్టర్లలో ఉపయోగించే గాలియం ఉత్పత్తిపై కూడా నియంత్రణ పెరిగింది.

ఈ టెక్నాలజీలు చైనా చేతిలోనే ఉండటం వల్ల ప్రపంచ విద్యుత్తు వాహనాల పరిశ్రమలో చైనా గట్టి పట్టు సాధిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా LFP, LMFP టెక్నాలజీ ఆధారిత బ్యాటరీల తయారీ 95 శాతం చైనాలోనే జరుగుతోంది. అందులో 76.6 శాతం LFP ఆధారిత ఈవీ వాహనాలు కూడా అక్కడే తయారవుతున్నాయి. టెస్లా కంపెనీ వై మోడల్ కూడా వీటిలో ఒకటి. ప్రత్యేకంగా LMFP టెక్నాలజీ వల్ల విద్యుత్తు నిల్వ సామర్థ్యం 15-20 శాతం పెరుగుతుంది, ఇది భవిష్యత్తులో కీలక టెక్నాలజీగా మారనుంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా అమెరికా, యూరోపియన్ యూనియన్, జపాన్ వంటి దేశాలు తమ దేశాల్లోనే బ్యాటరీ తయారీకి చర్యలు తీసుకుంటున్నా, చైనాలో ఉన్న ఈ టెక్నాలజీపై ఆధారపడకుండా ఉత్పత్తి చేయడం సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో టెక్నాలజీ బదిలీకి చైనా అనుమతులు తక్కువ వేగంతో ఇస్తుండడం ఇతర దేశాలకు పెద్ద చిక్కుగా మారింది.

అంతేకాక, ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనా విద్యుత్తు కార్లు, విండ్ టర్బైన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ఉపయోగించే ముఖ్యమైన అయస్కాంతాల ఎగుమతులపైనా ఆంక్షలు విధించింది. ఈ చర్యల ప్రభావం భారత మార్కెట్‌పైనా పడుతోంది. దేశీయంగా బ్యాటరీలు తయారు చేసేందుకు ప్రకటించిన రూ.18,000 కోట్ల ప్రోత్సాహక పథకం కూడా చైనా సహకారం లేకుంటే అంతగా ముందుకు వెళ్లకపోవచ్చు. ఇది భారత్‌లో బ్యాటరీ తయారీదారుల పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి