Breaking News

నెక్ట్స్‌ ఉపరాష్ట్రపతి ఎవరు..? బలంగా వినిపిస్తున్న ఓ మాజీ జర్నలిస్ట్‌ పేరు! ఆయన ఎవరంటే..?

నెక్ట్స్‌ ఉపరాష్ట్రపతి ఎవరు..? బలంగా వినిపిస్తున్న ఓ మాజీ జర్నలిస్ట్‌ పేరు! ఆయన ఎవరంటే..?


Published on: 23 Jul 2025 08:59  IST

భారతదేశంలో ఉపరాష్ట్రపతి స్థానం త్వరలో ఖాళీ కానుంది. ప్రస్తుతం ఈ పదవిని చేపట్టిన జగదీప్ ధన్‌ఖడ్ పదవీకాలం ముగియడంతో, ఆయన వారసుడి ఎంపికపై కేంద్రంలో చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇందుకోసం బీజేపీతో పాటు ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీల నేతల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తాజాగా ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవడం ఈ ఊహాగానాలకు మరింత బలమిచ్చింది.

బీహార్‌ రాష్ట్రానికి చెందిన హరివంశ్ సింగ్‌ రాజకీయాల్లో అనుభవజ్ఞుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన ఆర్థికశాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. రాజకీయాల్లోకి రాకముందు ప్రముఖ జర్నలిస్టుగా పనిచేశారు. ఓ దశలో మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు సలహాదారుగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఆ ప్రభుత్వం తరువాత జర్నలిజీలోకి తిరిగి వెళ్లిన ఆయన, 2014లో జెడీయూ తరఫున తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2020 నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.

ఉపరాష్ట్రపతి పదవిని రాజ్యాంగం ప్రకారం ఖాళీ అయిన 60 రోజుల్లోగా భర్తీ చేయాలి. అంటే ఈసారి కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికను సెప్టెంబర్ 19లోపు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంతో చర్చలు జరుపుతోంది. ఈ ఎన్నిక రాజ్యాంగంలోని ఆర్టికల్ 68 (2) ప్రకారం నిర్వహించబడుతుంది. ఎన్నికైన వ్యక్తి ఐదేళ్లపాటు ఉపరాష్ట్రపతిగా కొనసాగుతారు.

ఈ ఎన్నికలో పార్లమెంట్‌ ఉభయ సభల సభ్యులు మాత్రమే ఓటు వేయగలరు. అంటే 245 మంది రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్‌సభ ఎంపీలు కలిపి మొత్తం 788 మంది సభ్యులు గల ఎలక్టోరల్ కాలేజీ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. ఈ ఎన్నిక రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. ప్రస్తుతం బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నందున, వారే తమ అభ్యర్థిని విజయవంతంగా నిలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ పేరు జోరుగా వినిపిస్తోంది. ఆయనకు అనుభవం ఉండటమే కాకుండా, బీహార్‌కు చెందిన వ్యక్తిగా రాజకీయ సమీకరణాల్లోనూ అతనికి లాభం కలగొచ్చు. పైగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సైతం సమీపించుకుంటుండటంతో, హరివంశ్‌ ఎంపికతో బీజేపీ అక్కడ రాజకీయ లాభాలు పొందే ప్రయత్నం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఆయన పేరు ఒక్కసారిగా బలంగా తెరపైకి వచ్చి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Follow us on , &

ఇవీ చదవండి