Breaking News

సంక్రాంతి ప్రయాణాలకు గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

సంక్రాంతి ప్రయాణాలకు గ్రేటర్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు


Published on: 05 Jan 2026 10:59  IST

సంక్రాంతి పండగను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల రద్దీని సమర్థంగా నిర్వహించేందుకు గ్రేటర్ ఆర్టీసీ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. పండగ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు మెరుగుపరచే లక్ష్యంతో నగరం నుంచి సుమారు 1200 ప్రత్యేక బస్సులను నడపాలని ప్రణాళికలు రూపొందించింది. జనవరి 9 నుంచి 15 వరకు ఈ ప్రత్యేక బస్సులు నగర పరిసరాల్లో ఉన్న వివిధ డిపోల నుంచి రాకపోకలు సాగించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి అవసరమైతే మరిన్ని బస్సులు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ భావిస్తోంది. నగరం నుంచి నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, కందుకూరు, విజయవాడ, రాజమండ్రి, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి వంటి ప్రధాన ప్రాంతాలకు నేరుగా బస్సులు నడపేందుకు ప్రణాళికలు రూపొందించారు.

పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఎలక్ట్రిక్ బస్సులను ఎక్కువగా వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో బీహెచ్‌ఇఎల్ డిపో (ఆర్సీపురం) నుంచి మియాపూర్, కేపీహెచ్‌బీ ప్రాంతాలు, ఔటర్ రింగ్ రోడ్ మార్గంగా అమలాపురం, కాకినాడ, నర్సాపురం, విశాఖపట్నం, రాజమండ్రి, పోలవరం, గుంటూరు, విజయవాడ తదితర గమ్యస్థానాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు డిపో అధికారులు ప్రకటించారు.

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సురక్షితంగా, సౌకర్యవంతంగా గమ్యస్థానాలకు చేరుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి