Breaking News

బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులు

బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులు


Published on: 06 Jan 2026 10:27  IST

బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువుల భద్రతపై మరోసారి ఆందోళన నెలకొంది. నర్సింగ్డి జిల్లాలోని రద్దీగా ఉండే చార్‌సిందూర్ బజార్‌లో ఓ హిందూ కిరాణా వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో మణి చక్రవర్తి అనే వ్యాపారి అక్కడికక్కడే తీవ్రంగా గాయపడ్డాడు.

స్థానికుల కథనం ప్రకారం, మణి చక్రవర్తి సోమవారం రాత్రి తన దుకాణంలో పనిలో ఉండగా కొందరు దుండగులు అకస్మాత్తుగా షాపులోకి ప్రవేశించి అతనిపై దాడి చేశారు. రక్తస్రావంతో కుప్పకూలిన మణిని చుట్టుపక్కల వారు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మణి చక్రవర్తి ఎవరితోనూ శత్రుత్వాలు లేని వ్యక్తిగా, శాంత స్వభావం గల వ్యాపారిగా స్థానిక వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల తరచూ జరుగుతున్న ఇలాంటి హింసాత్మక ఘటనలతో తాము భయాందోళనకు లోనవుతున్నామని, నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇదే సమయంలో, జర్నలిస్టు రాణాప్రతాప్ బైరాగి హత్య జరిగిన కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. అంతకుముందు విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి హిందువులపై దాడులు పెరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గత 18 రోజుల వ్యవధిలో ఆరుగురు హిందువులు హత్యకు గురవడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. మైనారిటీల భద్రతపై అంతర్జాతీయంగా కూడా ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ ఘటనలపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి