Breaking News

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ సామూహిక హత్యల కేసులో ప్రధాన నిందితుడు పార్వతి రాజ్‌కుమార్ (35) శవమై లభించాడు

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ సామూహిక హత్యల కేసులో ప్రధాన నిందితుడు పార్వతి రాజ్‌కుమార్ (35) శవమై లభించాడు. 2026 జులై 13 సాయంత్రం కొత్తూరు సమీపంలోని పెంజర్ల వద్ద అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.


Published on: 13 Jul 2026 17:54  IST

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ సామూహిక హత్యల కేసులో ప్రధాన నిందితుడు పార్వతి రాజ్‌కుమార్ (35) శవమై లభించాడు. 2026 జులై 13 సాయంత్రం కొత్తూరు సమీపంలోని పెంజర్ల వద్ద అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. స్థానికులు మృతదేహాన్ని చూసి 'డయల్ 100'కు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు పట్టుకుంటారనే భయంతో అతడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

జులై 10 (శుక్రవారం) అర్ధరాత్రి దాటాక నిందితుడు రాజ్‌కుమార్ కక్షతో ఒకే రాత్రి ఆరుగురిని అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. నిందితుడు తన సొంత భార్య సరిత (30), ఇద్దరు చిన్న కుమారులు పరీక్షిత్ (4), దైవిక్ (2)లతో పాటు.. తనపై పోక్సో (POCSO) కేసు పెట్టిన కుటుంబానికి చెందిన అక్షయ (17), ఆమె తల్లి లక్ష్మి (42), నానమ్మ రుక్కమ్మ (65)లను దారుణంగా హతమార్చాడు.నిందితుడిపై గత మే నెలలో షాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. ఈ కేసులో జూన్ 12న ముందస్తు బెయిల్‌పై బయటకు వచ్చిన అతడు, తనపై కేసు పెట్టిన వారిపై మరియు తనకు సహకరించలేదనే కోపంతో భార్యాపిల్లలపై కక్ష పెంచుకుని ఈ నరమేధానికి పాల్పడ్డాడు.

హత్యల అనంతరం నిందితుడు పరారవడంతో, సైబరాబాద్ (ఫ్యూచర్ సిటీ) పోలీసులు అతడి కోసం 14 ప్రత్యేక బృందాలతో తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. అతడిని పట్టిస్తే రూ. 2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు.

దర్యాప్తులో భాగంగా తిమ్మాపూర్, చేగూరు రైల్వే ట్రాక్‌ల వద్ద అతడు రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించి, చివరి నిమిషంలో మనసు మార్చుకుని వెనక్కి తగ్గినట్లు సీసీటీవీ (CCTV) దృశ్యాల ద్వారా పోలీసులు గుర్తించారు.

మూడు రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న రాజ్‌కుమార్, చివరకు సోమవారం (జులై 13) సాయంత్రం కొత్తూరు పరిసరాల్లో శవమై తేలడంతో ఈ కేసులో ప్రధాన నిందితుడి చాప్టర్ ముగిసింది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement