Breaking News

తెలంగాణలో మరో కొత్త కార్యక్రమం.. వారందరికీ ప్రభుత్వం నుంచి సాయం.. లబ్దిదారుల ఎంపిక షురూ

తెలంగాణలో మరో కొత్త కార్యక్రమం.. వారందరికీ ప్రభుత్వం నుంచి సాయం.. లబ్దిదారుల ఎంపిక షురూ


Published on: 13 Jan 2026 10:16  IST

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పటికే పేదల సంక్షేమాన్ని లక్ష్యంగా పలు పథకాలు అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు అత్యంత పేద కుటుంబాలను ప్రత్యేకంగా గుర్తించి వారికి సంపూర్ణ సహాయం అందించే దిశగా అడుగులు వేస్తోంది.

బీపీఎల్ కుటుంబాల్లో ఇంకా తీవ్రమైన పేదరికంలో ఉన్నవారికి ప్రభుత్వం నేరుగా చేయూత అందించాలనే ఉద్దేశంతో ఈ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారికంగా వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా అత్యంత పేదల గుర్తింపు

ఇటీవల సచివాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి సీతక్క ఈ అంశంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్య దేవరాజన్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కుటుంబాలను గుర్తించేందుకు ఇంటింటి సర్వే చేపట్టాలని మంత్రి సూచించారు.

ఈ సర్వేను మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాలని, దశలవారీగా అమలు చేయాలని ఆదేశించారు. తొలుత అత్యంత వెనుకబడిన గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రారంభించి, ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరించనున్నారు. సర్వే ఆధారంగా అర్హులను గుర్తించి, వారికి క్రమంగా ప్రభుత్వ సహాయాన్ని అందించనున్నారు.

అన్ని రంగాల్లో సమగ్ర సహాయం

గుర్తించిన అత్యంత పేద కుటుంబాలకు ఒక్క పథకం వరకే పరిమితం కాకుండా, అన్ని రంగాల్లో మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్య, ఉపాధి, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్), జీవనోపాధి వంటి అంశాల్లో సమగ్ర సహాయం అందించనున్నారు.

ఈ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా సాగాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పక్షపాతం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

గ్రామస్థుల సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామస్థులందరి సమక్షంలో జరగనుంది. కుటుంబ జీవన స్థితి, ఆదాయం, నివాస పరిస్థితులు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని అర్హులను ఎంపిక చేయాలని మంత్రి సూచించారు. దీని ద్వారా నిజంగా అవసరమైన వారికి మాత్రమే ప్రభుత్వ సహాయం చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై ఈ కార్యక్రమానికి సంబంధించిన తుది నిర్ణయాలు తీసుకుంటామని సీతక్క వెల్లడించారు. పేదలను కేవలం సహాయంపై ఆధారపడే స్థితిలో కాకుండా, స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.

ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి శృతి ఓజా, మహిళా–శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి