Breaking News

కవాడిగూడలో భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

హైదరాబాద్‌లోని కవాడిగూడలో మంగళవారం (19 మే 2026) పట్టపగలు ఒక స్పా సెంటర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్న భార్యను ఆమె భర్త కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.


Published on: 19 May 2026 17:33  IST

హైదరాబాద్‌లోని కవాడిగూడలో మంగళవారం (19 మే 2026) పట్టపగలు ఒక స్పా సెంటర్లో బ్యూటీషియన్గా పనిచేస్తున్న భార్యను ఆమె భర్త కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘోరం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మృతురాలిని బహదూర్‌పూర్‌ కిషన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన బంగి దేబోరా (శ్రేత - 32 సంవత్సరాలు) గా పోలీసులు గుర్తించారు. ఆమె కవాడిగూడలోని రత్నదీప్ బిల్డింగ్ నాలుగో అంతస్తులో ఉన్న ఒక ప్రముఖ స్పా సెంటర్‌లో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది.

గత కొంతకాలంగా ఈ భార్యాభర్తల మధ్య తీవ్రమైన కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఈ రోజు (మంగళవారం) ఉదయం కూడా వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో, దేబోరా ఇంటి నుంచి బయలుదేరి తన విధులకు హాజరయ్యేందుకు స్పా సెంటర్‌కు వచ్చేసింది.

భార్యపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన భర్త, ఆమెను అంతమొందించాలనే పగతో తన వెంట ఒక కత్తిని తీసుకుని స్పా సెంటర్‌కు చేరుకున్నాడు. అక్కడ దేబోరాతో మళ్లీ గొడవకు దిగి, ఒక్కసారిగా కత్తితో ఆమెపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో దేబోరా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

భార్య చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత నిందితుడు సంఘటనా స్థలం నుండి పరారయ్యాడు. ఆ తర్వాత నేరుగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయి, తన నేరాన్ని ఒప్పుకున్నాడు.సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు వెంటనే క్లూస్ టీమ్‌తో సహా ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. దేబోరా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

 

Follow us on , &

ఇవీ చదవండి