Breaking News

నాలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు నేడు

కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ప్రారంభం కానుంది.


Published on: 04 May 2026 07:20  IST

దేశవ్యాప్తంగా ఫలితాల ఉత్కంఠ

కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభమవుతుండగా, అనంతరం ఈవీఎంల లెక్కింపును చేపడతారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొనగా, అన్ని రాజకీయ పార్టీల్లో తీవ్ర ఆసక్తి కనిపిస్తోంది.

బెంగాల్‌లో హోరాహోరీ పోటీ

పశ్చిమ బెంగాల్‌లో ఈసారి ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. టీఎంసీ మరియు బీజేపీ మధ్య నువ్వా-నేనా అన్నట్టుగా పోటీ సాగడంతో ఫలితాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 294 అసెంబ్లీ స్థానాల్లో ఒక నియోజకవర్గంలో పోలింగ్ రద్దు కావడంతో 293 స్థానాల ఫలితాలు వెలువడనున్నాయి. గత మూడు ఎన్నికల్లో విజయం సాధించిన టీఎంసీ నాలుగోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలనే ధీమాతో ఉంది. మరోవైపు బీజేపీ ఈసారి గెలిచి రాష్ట్రంలో కొత్త చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ నియోజకవర్గ ఫలితం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

తమిళనాడులో త్రిముఖ పోరు

తమిళనాడులో ఎప్పటిలాగే ద్విముఖ పోరు కాకుండా ఈసారి త్రిముఖ పోరు ఆసక్తిని రేకెత్తిస్తోంది. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో పాటు నటుడు విజయ్ స్థాపించిన పార్టీ కూడా ప్రభావం చూపే ప్రయత్నం చేసింది. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశాలు ఉన్నాయనే అంచనాలతో రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఫలితాల ముందు నుంచే అభ్యర్థులను రిసార్టులకు తరలించే ప్రయత్నాలు జరగడం రాజకీయ ఉత్కంఠను మరింత పెంచింది.

కేరళ, అస్సాంలో కీలక పోటీ

కేరళలో వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ వరుస విజయాన్ని కొనసాగిస్తుందా లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. పోలింగ్‌కు ముందు సీఎం పినరయ్ విజయన్ తన సోషల్ మీడియా ఖాతాలో సీఎం పదవిని తొలగించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. అస్సాంలో బీజేపీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందనే నమ్మకంతో ఉండగా, కాంగ్రెస్ కూడా గెలుపుపై ఆశలు పెట్టుకుంది. మొత్తం 722 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుండగా, పుదుచ్చేరిలో కూడా అధికార మార్పుపై ఉత్కంఠ కొనసాగుతోంది.

పుదుచ్చేరిలో అధికారం ఎవరిది?

పుదుచ్చేరిలో కూడా రాజకీయ పోటీ ఆసక్తికరంగా మారింది. ఏఐఎన్‌ఆర్‌సీ-బీజేపీ కూటమి మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక కాంగ్రెస్-డీఎంకే కూటమి తిరిగి పగ్గాలు చేపడుతుందా అన్నది ఉత్కంఠగా మారింది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాల ఫలితాలు నేడు వెలువడనున్నాయి.

 

Follow us on , &

ఇవీ చదవండి