Breaking News

టిమ్ కుక్ పదవి నుంచి వైదొలగనున్న సమాచారం – ఆపిల్ కొత్త సీఈవోగా జాన్ టెర్నస్ పేరే ముందుకు

టిమ్ కుక్ పదవి నుంచి వైదొలగనున్న సమాచారం – ఆపిల్ కొత్త సీఈవోగా జాన్ టెర్నస్ పేరే ముందుకు


Published on: 15 Nov 2025 17:01  IST

ప్రపంచంలో అత్యున్నత టెక్ కంపెనీల్లో ఒకటైన ఆపిల్‌కు దాదాపు 13 సంవత్సరాలుగా నాయకత్వం వహిస్తున్న టిమ్ కుక్ త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్నారన్న వార్తలు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. 2011లో స్టీవ్ జాబ్స్ బాధ్యతలు స్వీకరించిన కుక్ వచ్చే ఏడాదితో 65 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. ఆయన పదవీకాలం ముగింపు దశలో ఉండటంతో, ఆపిల్‌ను తర్వాత ఎవరు నడిపిస్తారు అనే ప్రశ్న అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ నేపథ్యంలో, ఆపిల్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న జాన్ టెర్నస్ పేరు కొత్త సీఈవో రేసులో ముందంజలో ఉన్నట్లు సమాచారం. టిమ్ కుక్ ఆపిల్ ఆపరేషన్స్‌ను గ్లోబల్ స్థాయిలో మార్చి పెట్టిన మేధస్సైతే, జాన్ టెర్నస్ ఆపిల్ ఉత్పత్తుల రూపకల్పనకు వెన్నెముకగా భావిస్తారు.

2001లో డిజైన్ టీంలో భాగంగా ఆపిల్‌లో చేరిన టెర్నస్, ఐఫోన్, ఐప్యాడ్, మాక్, ఎయిర్‌పాడ్స్ వంటి దాదాపు అన్ని ప్రధాన ఉత్పత్తుల అభివృద్ధి మరియు ఇంజనీరింగ్‌కి కీలకంగా మారాడు. ప్రతి తరం ఐప్యాడ్‌కు కొత్త ఆకృతి తీసుకురావడంలో అతని పాత్ర ప్రత్యేకంగా చెప్పుకుంటారు.

ఆపిల్‌లో చేరే ముందు జాన్ టెర్నస్ వర్చువల్ రీసెర్చ్ సిస్టమ్స్ సంస్థలో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేశాడు. అదేకాక, అతను పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఆపిల్ 50 ఏళ్ల చరిత్రలో ఆరవ సీఈవోగా మారే అవకాశంతో అతని పేరు చర్చల్లో ఉంది.

కంపెనీ కొత్త సీఈవోపై అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు. టిమ్ కుక్ నాయకత్వంలో ఆపిల్ కంపెనీ విలువ 350 బిలియన్ డాలర్ల నుంచి 4 ట్రిలియన్ డాలర్లకు పెరగడం విశేషం. ఆపిల్ ఆదాయ ప్రకటన తర్వాతే కొత్త సీఈవోపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు బ్యాక్గ్రౌండ్‌లో సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి