Breaking News

పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ దౌత్యవేత్తలు భారత్ విడిచి వెళ్లాలని సమన్లు

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.పాక్ దౌత్యవేత్తలు భారత్‌ను వారం రోజుల్లో విడిచిపెట్టాలని సమన్లు


Published on: 24 Apr 2025 11:39  IST

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24:జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ సర్కార్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.

ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని పాకిస్తాన్ రాయబారి సాద్ అహ్మద్ వరైచ్‌కు బుధవారం అర్థరాత్రి కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. ఆయనకు భారత్‌ను వారం రోజుల్లో విడిచిపెట్టాలని చెప్పింది. దీంతో పాటు, భారత్‌లో విధులు నిర్వహిస్తున్న పాక్ మిలటరీ డిప్లమాట్లను కూడా వెనక్కి పంపించే నిర్ణయం తీసుకుంది. ఇదే విధంగా, ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందిని దేశానికి పిలిపించుకునేందుకు సిద్ధమైంది. ఇది పాకిస్తాన్‌తో భారత్ అన్ని రకాల దౌత్య సంబంధాలను సమీక్షిస్తోందని సంకేతంగా భావించవచ్చు.

ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఒకరు నేపాలీ పౌరుడిగా గుర్తించబడ్డారు. ఈ దాడిని ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. దాంతో, పాక్‌తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడమే కాకుండా, అట్టారి సరిహద్దును తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. పాక్ మిలటరీ రాయబారులకు ‘పర్సన నాన్ గ్రాటా’ గుర్తింపునిస్తూ, ఇకపై వారు భారత్‌లోకి రావడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.పహల్గాం దాడి జరిగిన వెంటనే, విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ దుబాయ్ నుంచి భారతదేశానికి తిరిగివచ్చారు. ఢిల్లీకి వచ్చిన వెంటనే భద్రతా వ్యవహారాలపై ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాక్‌పై తీసుకోవాల్సిన చర్యలపై కీలకంగా చర్చించారు.దాడి జరిగిన తరువాత హోం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ వెళ్లి, రాష్ట్ర గవర్నర్‌తో పాటు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. భద్రతా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. అమిత్ షా మరణించిన వారికి నివాళులర్పించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం వారి వెంట ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ చర్యలన్నీ, భారత్ పాక్‌పై తీవ్ర స్థాయిలో దౌత్యపరంగా ఒత్తిడి తేవడానికి తీసుకుంటున్న ప్రాధాన్యమైన స్టెప్పులుగా భావించవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి