Breaking News

ఉమ్మడి కృష్ణాజిల్లాలో సంక్రాంతి హడావుడి… కోడి పందేలకు భారీ ఏర్పాట్లు

ఉమ్మడి కృష్ణాజిల్లాలో సంక్రాంతి హడావుడి… కోడి పందేలకు భారీ ఏర్పాట్లు


Published on: 14 Jan 2026 10:41  IST

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉమ్మడి కృష్ణాజిల్లా అంతటా కోడి పందేల సందడి మొదలైంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం వరకు పలు ప్రాంతాల్లో బరులను సిద్ధం చేస్తున్నారు. ఖాళీ స్థలం ఎక్కడ కనిపించినా అక్కడే పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పుంజులకు కత్తులు కట్టేందుకు నిర్వాహకులు ముందుగానే సన్నాహాలు పూర్తి చేశారు.

ఈసారి కోడి పందేల్లో ఎన్‌ఆర్‌ఐల హాజరు ఎక్కువగా ఉండనుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. క్రిస్మస్ సెలవుల కోసం విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన వారు, సంక్రాంతి ఉత్సవాలను చూసిన తర్వాతే తిరిగి వెళ్లాలన్న ఉద్దేశంతో తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మూడు విభాగాలుగా బరులు… భారీ పందేలకు ప్రత్యేక ఏర్పాట్లు

గ్రామగ్రామాన కోడి పందేల కోసం బరులు సిద్ధమయ్యాయి. రాజకీయ నాయకుల మద్దతుతో కొన్ని చోట్ల భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఔట్‌డోర్ బాక్సింగ్ మ్యాచ్‌లను తలపించేలా తాత్కాలిక మినీ స్టేడియంలను కూడా నిర్మించారు. విశాలమైన ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన బరులను మూడు కేటగిరీలుగా విభజించారు.

చిన్న మొత్తాల్లో పందేలు కట్టేవారికి ఒక బరి, మధ్యస్థ స్థాయి పందాల కోసం మరో బరి, లక్షల్లో పందేలు పెట్టేవారికి మూడో బరిని కేటాయించారు. వీటిని మైనర్, మీడియం, మేజర్ బరులుగా నిర్వాహకులు పిలుస్తున్నారు.

  • మైనర్ బరి: రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు పందేలు

  • మీడియం బరి: రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు

  • మేజర్ బరి: రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు, అంతకంటే ఎక్కువ

ప్రేక్షకుల భద్రత కోసం బరుల చుట్టూ కుర్చీలు ఏర్పాటు చేశారు. బరిని మాత్రం కుర్చీల కంటే రెండు నుంచి మూడు అడుగుల ఎత్తులో నిర్మించారు. అలాగే బరి చుట్టూ మోకాలి లోతు వరకు గోతులు తవ్వారు. వీక్షకులు బరిలోకి ప్రవేశించకుండా ఉండేందుకే ఈ ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రతి కేటగిరీకి అనుగుణంగా ప్రత్యేక టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించారు. ఎవరు ఏ స్థాయిలో పందెం కడతారో, ఆ స్థాయి బరికి మాత్రమే అనుమతి ఉండేలా వ్యవస్థను అమలు చేస్తున్నారు.

గెలిచినా కమీషన్ తప్పనిసరి

పుంజు ఎవరిదైనా సరే… పందెం ఎవరు గెలిచినా నిర్వాహకులకు కమీషన్ చెల్లించాల్సిందేనని ముందుగానే స్పష్టం చేశారు. కోడి పందేలు జరిగే ప్రాంగణాల్లో ఫుడ్ స్టాల్స్, పార్కింగ్ స్థలాలు, మద్యం విక్రయ కేంద్రాల కోసం వేలం పాటలు నిర్వహించారు. అత్యధిక ధర పలికిన వారికి ఆ స్థలాల నిర్వహణ హక్కులు అప్పగించారు.

ఇప్పటికే ఈ వేలం పాటల ద్వారా భారీ మొత్తాలు వసూలు చేసిన నిర్వాహకులు, పందేలపైనా తమ వాటాను ఖరారు చేసుకున్నారు. ప్రతి పందెంపై 5 నుంచి 10 శాతం వరకు కమీషన్ ఇవ్వాల్సిందేనని షరతు పెట్టారు. పందెం గెలిచినా, ఓడినా ఈ కమీషన్ తప్పనిసరి అని నిర్వాహకులు చెబుతున్నారు.

విజయవాడలో హోటళ్లు, లాడ్జీలు అన్నీ బుక్

సాధారణంగా కోడి పందేలకు ఉభయ గోదావరి జిల్లాలు ప్రసిద్ధి. కానీ ఇటీవలి కాలంలో ఉమ్మడి కృష్ణాజిల్లా కూడా సంక్రాంతి పందేల కేంద్రంగా మారింది. అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నేతలే ఎక్కువగా బరులను ఏర్పాటు చేస్తున్నారన్న చర్చ కూడా ఉంది.

ఇక్కడ జరిగే కోడి పందేలను చూసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు వస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి భారీగా సందర్శకులు వస్తుండటంతో విజయవాడలో వసతి సదుపాయాలు పూర్తిగా నిండిపోయాయి.

విజయవాడలో ఉన్న సుమారు 15 స్టార్ హోటళ్లలోని 1200 గదులు, అలాగే చిన్న లాడ్జీల్లోని దాదాపు 5 వేల గదులు భోగి రోజు ఉదయం నుంచే కనుమ రాత్రి వరకు పూర్తిగా బుక్ అయ్యాయి. ప్రస్తుతం నగరంలో గది దొరకడం కూడా కష్టంగా మారిందని హోటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి