Breaking News

ఆషాఢ మాసంలోని రెండోరోజు మేళతాళాలతో పాండాలు (పూజారులు) జగన్నాథుని పూజా కార్యక్రమం నిర్వహిస్తారు.

సోదరుడు బలరాముడు, సోదరి సుభ్రదలతో కలిసి కొలువుతీరిన కృష్ణుడు జగన్నాథుని పేరుతో పూజలందుకుంటున్నాడు.


Published on: 26 Jun 2025 09:07  IST

ఓడిశాలోని పూరీ ప్రాచీనంగా పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఇది కేవలం శ్రీకృష్ణుడి దేవస్థానం మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక అనుభూతుల కేంద్రముగా మారింది. జగన్నాథుడిగా శ్రీకృష్ణుడు తన అన్నయ్య బలరాముడు, చెల్లెం సుభద్రతో కలసి ఇక్కడ దర్శనమిస్తుండడం విశిష్టత. ఇతర దేవాలయాల్లో ఏకమూర్తి రూపం కనిపించగా, ఇక్కడ కుటుంబంతో కనిపించటం భక్తుల్లో మరింత మమకారాన్ని కలిగిస్తుంది.

పూరీ అనే పేరు కూడా కాలక్రమంలో "జగన్నాథపురి" అనే పేరుతో రూపాంతరం చెంది ఏర్పడింది. శాస్త్రప్రకారం, రామలక్ష్మణులు తరువాత జన్మల్లో కృష్ణ-బలరాములుగా పుట్టినట్టు చెప్పబడుతుంది. శ్రీరాముడు సీతా లక్ష్మణులతో ఉన్నట్టు, శ్రీకృష్ణుడు కూడా తన సహోదరులతో కలిసి ఇక్కడ దర్శనమిస్తారు.

పూరీ జగన్నాథ ఆలయం ప్రత్యేకమైన నిర్మాణం కలిగి ఉంటుంది. ఇది నాలుగు దిక్కులకూ ప్రవేశ ద్వారాలతో ఉండటం, స్వామివారి మూర్తులు చెక్కతో తయారవడం, రోజూ 56 రకాల నైవేద్యాలను సమర్పించడం వంటి అంశాలు దీన్ని ఇతర దేవాలయాల కంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి. పూరీ ఆలయంలో వంటకాలు మట్టి పాత్రలలో మాత్రమే తయారవుతాయి. ఇది అక్కడి ఆచార ధర్మాలకు ప్రతీక.

పూరీ రథయాత్ర హిందూ ధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఉత్సవం. ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ నుండి దశమి వరకు తొమ్మిది రోజులు జరిగే ఈ ఉత్సవానికి నెలల ముందుగానే ఏర్పాట్లు మొదలవుతాయి. రథాల తయారీకి అక్షయ తృతీయ నాడు శ్రీకారం చుడతారు. స్వాముల రథాలకు ప్రత్యేక పేర్లు ఉన్నాయి – జగన్నాథుడి రథం "నందిఘోష", బలరామునిది "తాళధ్వజ", సుభద్రాదేవి రథం "దర్పదలన్".

పహండీ అనే కార్యక్రమంలో స్వామి విగ్రహాలను ఆలయప్రాంగణం నుంచి బయటకు తీసుకెళ్లి రథాలపై ప్రతిష్ఠిస్తారు. దీని సమయంలో వేలాది మంది భక్తులు "జగన్నాథా" అని నినాదిస్తూ స్వామి రథాన్ని లాగుతూ కనిపిస్తారు. ఈ ఉత్సవానికి సంబంధించిన విశేషమేమిటంటే – రథాలపై ప్రతిష్ఠించడానికి, ఆలయం నుంచి విగ్రహాలను మోసే హక్కు కేవలం సవర తెగకు చెందినవారికే ఉంటుంది. ఇది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం.

పూరీ క్షేత్రంలో శైవ, వైష్ణవ, శక్తి, బౌద్ధ, జైన తత్త్వాలు సమ్మిళితంగా కనిపిస్తాయి. అందుకే దీనిని మతాతీత క్షేత్రంగా భావిస్తారు. గురునానక్, కబీర్, తులసీదాస్ వంటి మహాత్ములు ఈ స్థలాన్ని సందర్శించి తపస్సులు చేసిన చరిత్ర ఉంది. పూరీ చార్ధామ్ యాత్రలో భాగమైనది కూడా కావడం దీన్ని మరింత ప్రాముఖ్యమున్నదిగా చూపిస్తుంది.

రథయాత్ర సందర్భంగా పూరీ రాజు బంగారు చీపురుతో రథాల చుట్టూ నేలను ఊడుస్తారు. ఈ కార్యక్రమాన్ని "చెరా పహరా" అంటారు. ఇది సామాన్య ప్రజల మధ్య పాలకుడి వినయాన్ని సూచిస్తుంది. పూరీ జగన్నాథ దర్శనం ద్వారా జన్మ సార్థకమైందని భావించే భక్తులు, స్వామివారి రథాన్ని లాగడం ద్వారా పుణ్యఫలాలను పొందతారు.

పూరీ రథయాత్ర వెనుక ఉన్న కథనాలూ వైవిధ్యభరితంగా ఉంటాయి. కొందరు దీన్ని ద్వాపరయుగంలో కంస వధకు బయలుదేరిన సమయంలో జ్ఞాపకార్థంగా చూస్తారు. మరికొంతమంది సుభద్రాదేవి ద్వారక దర్శన కోరికే యాత్రకు కారణమని విశ్వసిస్తారు. అంతేకాదు, శ్రీకృష్ణ భౌతిక మరణానంతరం ఆయన హృదయాన్ని ఈ ఆలయంలో భద్రపరిచారన్న విశ్వాసం కూడా ఉంది. ఇది భక్తి పరాకాష్ఠకు గుర్తుగా నిలుస్తుంది.

ఈ యాత్రకు సంబంధించిన మరో ప్రత్యేకత ఏమిటంటే – శ్రీజగన్నాథునికి అంకితమైన 11 నామాలతో స్తోత్రం ఉంటుంది. వాటిలో చివరి రెండు "జగన్నాథ జగన్నాథా". మొదటి జగన్నాథ పూరీ స్వామివారి నామం కాగా, రెండవది లోకనాథుడైన శ్రీమహావిష్ణువునిదే. ఈ నామాలను స్మరించిన భక్తులకు సకల దోషాలు తొలగి శుభఫలితాలు లభిస్తాయని విశ్వాసం.

పూరీ క్షేత్రాన్ని పాలించే క్షేత్రపాలకుడు శివుడే. ఇది శివ-కేశవ సారూప్యానికి సూచనగా భావించవచ్చు. బ్రహ్మదేవుడే ఈ ఆలయ నిర్మాణానికి కారణమని పురాణకథనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఆలయంలో ఒక్కసారి దర్శనం కలిగితే త్రిమూర్తుల కృపలభించిందని భక్తులు విశ్వసిస్తారు.

పూరీ జగన్నాథుని దర్శనం, రథయాత్రలో పాల్గొనడం వల్ల భక్తులు తమ జీవితాన్ని సార్థకంగా మార్చుకుంటారన్న విశ్వాసం వేల ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ క్షేత్రాన్ని సందర్శించి, రథయాత్రను చూసిన వారు పవిత్రులవుతారని భావన, అందుకు అనుగుణంగా అనుభవం అనిర్వచనీయమై ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement