Breaking News

దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల ముప్పు, తెలంగాణ రాష్ట్ర పోలీస్‌శాఖ అప్రమత్తం

హైదరాబాద్‌ నగరంలో గురువారం రాత్రి నుంచే భద్రతా ఏర్పాట్లు. హైటెక్ సిటీ, పాతబస్తీ, పర్యాటక ప్రాంతాల్లో తనిఖీలు,నిఘా చర్యలు. అనుమానాస్పద వ్యక్తులపై కౌంటర్ ఇంటెలిజెన్స్ నిఘా.


Published on: 24 Apr 2025 10:17  IST

కశ్మీర్‌లోని పహల్గాం బైసరన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాక్ మద్దతుతో పనిచేస్తున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ అనే ఉగ్ర సంస్థ బాధ్యంగా ఉంది. సైనికుల వేషధారణలో వచ్చిన ఉగ్రవాదులు అక్కడి పర్యాటకులపై విచక్షణలేని కాల్పులు జరిపారు. తర్వాత వారు అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. ఈ ఘటనపై అనేక దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

ఇలాంటి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తెలంగాణ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో నిర్వహించే ‘భారత్ సమిట్ – 2025’ మరియు మే 7 నుంచి మొదలయ్యే ‘మిస్ వరల్డ్ – 2025’ పోటీల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను బలపరిచారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నగరంలో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు.చీఫ్ సెక్రటరీ శాంతికుమారి సూచనల మేరకు డీజీపీ జితేందర్ పలు సూచనలు జారీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల నుంచి ప్రతినిధులు, 140 దేశాల నుంచి మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు రానుండటంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నారు.

సైబరాబాద్ పరిధిలోని ముఖ్య ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచే భద్రతా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. హైటెక్ సిటీ, పాతబస్తీ, పర్యాటక ప్రాంతాల్లో తనిఖీలు, నిఘా చర్యలు పెంచారు. అనుమానాస్పద వ్యక్తులపై కౌంటర్ ఇంటెలిజెన్స్ నిఘా కొనసాగిస్తోంది. గతంలో ఉగ్రదాడులకు గురైన ప్రాంతాలతోపాటు ఇతర ముఖ్య ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.

ప్రముఖ ఈవెంట్లు జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఈ భద్రతా ఏర్పాట్లను ఒక సవాలుగా తీసుకుని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ముందుగా ప్లాన్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి