Breaking News

నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలకు సుమారు రూ.21,000 వీసా ఇంటిగ్రిటీ ఫీజు..

డిప్లొమాటిక్ వీసాలు (A, G), కొన్ని ఇతర ప్రత్యేక వీసాలకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.


Published on: 10 Jul 2025 09:30  IST

అమెరికా వెళ్లాలని కలలకంటున్నవారికి ఒక భారీ ఆర్థిక భారంగా మారే విధంగా ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వలస విధానం 2026 నుంచి అమల్లోకి రానుంది. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ కొత్త చట్టం కింద, నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలకు సుమారు ₹21,000 వరకు అదనపు వీసా ఇంటిగ్రిటీ ఫీజు విధించనున్నారు.

ఈ నిర్ణయం విద్యార్థులు, టూరిస్టులు, ఉద్యోగార్ధులకు గట్టిపాటు అవుతుంది. ఇప్పటికే ఉన్న ట్యూషన్ ఫీజులు, జీవన ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్న భారతీయ విద్యార్థులకు ఇది మరో భారం. అలాగే తమ పిల్లలను కలవడానికి అమెరికా వెళ్లే తల్లిదండ్రులకు కూడా ఇది భారంగా మారుతుంది. ప్రస్తుతం B2 టూరిస్ట్ వీసా ఖర్చు ₹15,000 ఉంటే, ఈ కొత్త ఫీజుతో కలిపి మొత్తం ఖర్చు ₹35,000 దాటుతుంది.

ఈ ఫీజు ప్రతి ఏడాది పెరుగుతుంది. దాన్ని తగ్గించడమో, రద్దు చేయడమో జరగదు. డిప్లొమాటిక్ వీసాలు (A, G) వంటి కొన్ని వీసాలకు మినహాయింపు ఉన్నా, ఎక్కువ వీసా రకాలపై ఇది వర్తిస్తుంది. H4 వీసాలకు వర్తిస్తుందా లేదా అనే విషయంపై స్పష్టత లేదు.

2025లో H1B వీసా రిజిస్ట్రేషన్ ఫీజు రూ.850 నుంచి ఏకంగా రూ.21,000కి పెరిగింది. దీని ప్రభావంతో 2026లో H1B దరఖాస్తుల సంఖ్య తగ్గే అవకాశముంది. అమెరికాలో ఉన్న సమయంలో వీసా నిబంధనలు కచ్చితంగా పాటిస్తే కొన్ని పరిస్థితుల్లో ఈ ఫీజును రీఫండ్ చేసే అవకాశం ఉంది. ఐ-94 గడువు ముగిసే ముందు దేశం విడిచిపెట్టినవారికి లేదా చట్టబద్ధంగా స్టేటస్ మారినవారికి ఇది వర్తిస్తుంది.

ఈ చర్యల ద్వారా అమెరికా ప్రభుత్వం వలసదారులపై కట్టుదిట్టమైన నియంత్రణతో పాటు వీసా వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావాలనుకుంటోంది. అయితే, ఫీజు భారంతో చాలామందికి అమెరికా ప్రయాణం ఓ కలగా మిగిలిపోవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement